సీఎం పదవికి రాజీనామా చేసిన హిమంత బిశ్వ శర్మ

  • అసోం ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం
  • మే 11న కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం
  • అప్పటి వరకు తాత్కాలిక సీఎంగా వ్యవహరించనున్న హిమంత

అసోం రాజకీయాల్లో నూతన ప్రభుత్వ ఏర్పాటు దిశగా కీలక అడుగు పడింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన కేబినెట్ సహచరులతో కలిసి గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేయగా, ఆయన దానిని ఆమోదించారు. అయితే, కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాలని గవర్నర్ ఆయనను కోరారు. 126 స్థానాలున్న అసోం అసెంబ్లీలో బీజేపీ కూటమి ఏకంగా 102 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.


రాజీనామా అనంతరం లోక్ భవన్ వెలుపల మీడియాతో మాట్లాడిన హిమంత బిశ్వ శర్మ, ఈ చారిత్రాత్మక విజయం తర్వాత కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం మే 11 తర్వాత ఉంటుందని వెల్లడించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర పరిశీలకుల సమక్షంలో త్వరలోనే జరగబోయే బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని అధికారికంగా ఎంపిక చేయనున్నారు. అసోంలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టబోతుండటంతో అటు పార్టీ వర్గాల్లో, ఇటు ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


Himanta Biswa Sarma
Assam
Assam Politics
Assam Assembly Elections
BJP
NDA Alliance
Laxman Prasad Acharya
Assam CM
Narendra Modi
New Government Formation

More Telugu News